డ్రగ్స్ కేసులో కోలీవుడ్ నటి అరెస్ట్

  • డ్రగ్స్ కేసులో కోలీవుడ్ నటి అంజు కృష్ణను అరెస్టు చేసిన చెన్నై పోలీసులు
  • చెన్నై వలసరవాక్కం ప్రాంతంలో దాడులు నిర్వహించి నిందితుల అరెస్టు
  • నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా జ్యూడీషియల్ రిమాండ్ విధించిన వైనం
డ్రగ్స్ కేసులో ఓ నటి అరెస్టు కావడం కోలీవుడ్ ఇండస్ట్రీలో కలకలాన్ని రేపింది. యాంటీ నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో చెన్నై పోలీసులు భారీ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఛేదించారు. ఈ కేసులో కోలీవుడ్ నటి అంజు కృష్ణ, తమిళ కో-డైరెక్టర్ విన్సీ నివేత సహా మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

చెన్నై వలసరవాక్కం ప్రాంతంలో దాడులు నిర్వహించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో అంజు కృష్ణ, విన్సీ నివేత, కార్తిక్ రాజు, యశ్వంత్, శ్రీరామ్, అల్విబిన్షా, వెంకటేష్ కుమార్ తదితరులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి ఆరు గ్రాముల మెతాంఫేటమైన్ (మెత్), ఏడు గ్రాముల ఓజీ గంజాయి, 15 గ్రాముల సాధారణ గంజాయి, ఎల్‌ఎస్‌డీ స్టాంపులు, స్మోకింగ్ బాంగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా తొమ్మిది మొబైల్ ఫోన్లు, ఒక కారును సైతం సీజ్ చేశారు. 

అరెస్ట్ చేసిన నిందితులను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, వారికి న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ కేసుకు సంబంధించి డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌పై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
 

Anju Krishna
Kollywood actress
drugs case
Chennai police
Vincy Nivetha
narcotics
methamphetamine
OG ganja
drug network

More Telugu News